337..
కత్తులు బాంబులు పనేమి లేదోయ్..మెత్తని తియ్యని నవ్వులు చాలోయ్..!
మాటల 'మిస్సైల్స్' పనేమి లేదోయ్..కమ్మని చల్లని అగ్నులు చాలోయ్..!
మనసను పొలమును దున్నే పనిలో నిమగ్నమగుటే పండుగ చూడూ..!
బీజములన్నీ తరువులు కాగా..వెచ్చని వాడని తలపులు చాలోయ్..!
తెలియని తనమని తెలివిగ చెప్పకు..తప్పని'సరిగా శక్తిని తోడూ..!
కర్మల మంటలు కాల్చేటందుకు..వెనుకకు వేయని అడుగులు చాలోయ్..!
ఉన్నది లేనిది..లేనిది ఉన్నది..సత్యము చెప్పగ మాటలు ఏలా..!
మౌనపు నిధినే పట్టాలంటే..ఆరని చక్కని చూపులు చాలోయ్..!
బంగరు హంసలు సాగే దారిని..లేదే అలసట..రాదే దుఃఖం..!
రెక్కలు చక్రాల్ అక్కర లేదోయ్..తరగని చిక్కని మధువులు చాలోయ్..!
రాధా మైత్రీ బృందావనిగా..ఉన్నది నీవే.. కనవో నేస్తం..!
'మాధవ' వేణువు మాదిరి మిగులగ..మరగని కరగని వలపులు చాలోయ్..!