549..
ఎవరిపైనొ కసి ఎందుకు..ప్రతి క్షణమొక గురువేగా..!
దేనికొరకొ గొడవెందుకు..ప్రతి కణమొక గురువేగా..!
పట్టుదలకు మారుపేరు..నీ ఊపిరి..నిండినంత..!
దూకేందుకు సిద్ధమైన..ప్రతి చినుకొక గురువేగా..!
నీడనిచ్చు చెట్టులాగ..ఎదగాలని భావిస్తే..
మొలకెత్తే గింజ లాంటి..ప్రతి తలపొక గురువేగా..!
గోడమీద బొగ్గుతోటి..గీసేసే పసివాడికి..
ఎదురొచ్చే పువ్వులాంటి..ప్రతి నవ్వొక గురువేగా..!
'అంబా' అను ఆవుదూడ..గంతులేమి చెబుతాయా..!
నిజవేదం నేర్పించే..ప్రతి పదమొక గురువేగా..!
మానవుడే..'మాధవు'డౌ..మార్గమదే తెలిసిందా..!
మౌనముగా సాగించే..ప్రతి అడుగొక గురువేగా..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు