@గజల్ మహల్..01-02.// 566..//
ఆ మల్లెలు నేర్చుకొనెను..పరిమళించ నీ నవ్వున..!
ఆ జాబిలి తెలుసుకొనెను..సిగ్గుపడగ నీ నవ్వున..!
సెలయేరుల కుచ్చెళ్లకు మువ్వలేల కట్టేవో..!
గలగలలను అందుకొనెను..సందడించ నీ నవ్వున..!
నీ పచ్చని పరికిణీగ ఉన్నదిలే వనమంతా..!
ఈ పుడమియె విచ్చుకొనెను..పులకరించ నీ నవ్వున..!
విరహమేల గుప్పింతువు సమయానికి ఓ చెలియా..!
ఈ కాలమె అల్లుకొనెను..తీవలాగ నీ నవ్వున..!
సిందూరపు ఓణీతో..సంధ్య మోము కప్పేవా..!
సూరీడే విచ్చుకొనెను..మౌనమ్ముగ నీ నవ్వున..!
ఓ 'మాధవ' ప్రియ రాధా..జగమంతా నిండినావు..!
గగనాలే పరచుకొనెను..తారకలుగ నీ నవ్వున..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు