309..
ఎంత నేర్పు నీది.. ఎలా నేర్పుతావు ఓర్పుగాను..!
గొప్పలన్నినీవేగా..దారి చూపుతావు ఓర్పుగాను..!
పాట 'గుండె లయల'దొరా..నిను పొగడగ నా తరమా..!
అడుగక'నే సాయమౌతు నడుపుతావు ఓర్పుగాను..!
ఆట నీది.. మాట నీది..మాటాడని మౌన నిధీ..!
తలచి తలచగానె ఎదను..ఒదుగుతావు ఓర్పుగాను..!
చిలిపితనపు చిరునామా..ఉంది కదా నీ కన్నుల..!
అద్దమంటి సొగసులెన్నొ నింపుతావు ఓర్పుగాను..!
వేళ తోటి పనియె లేక ప్రణయ మధువు కురిపింతువు..!
చెరగని చిరు నగవులతో కరుగుతావు ఓర్పుగాను..!
మోసమింత చేయనట్టి వేషాలే వేసినావు..!
ప్రేమ రూపు దాల్చి ఎదలు ఏలుతావు ఓర్పుగాను..!
యుగాలెన్ని గడచిననూ తిరుగు లేదు నీ గీత'కు..!
అలవోకగ చిక్కకనే చిక్కుతావు ..ఓర్పుగాను..!
వెన్నెలకే వెన్నెలవే..ఎంతల్లరి దొంగవోయి..!?
వెన్నలన్ని పంచి పెట్టి..నక్కుతావు ఓర్పుగాను..!
పుట్టినావు చెరసాలను..కర్మ చెరలు వదిలించగ..!
అలుగకనే నలుగకనే..మిగులుతావు ఓర్పుగాను..!
బృందావన సీమ నిలుపు.. నా 'మాధవ' కన్నయ్యా..!
రాధ మదిని చిత్రముగా వెలుగుతావు..ఓర్పుగాను..!