4590..గజల్.
నిన్ను గుర్తు చేసుకునే..అవసరమే రాదులే..!
మనసువిప్పి మాటలలో..పెట్టడమే రాదులే..!
నీవులేని క్షణం ముందు..యుగం ఎంత చిన్నదో..
మోయలేని ఈ భారం..చూపడమే రాదులే..!
కురులలాగ ఆరబోసి..అటుతిరుగుట న్యాయమా..
చీకటి పై తిరుగుబాటు..చేయడమే రాదులే..!
విరహాగ్నిని విందుసేయు..వేడుకేల నిలుపవో..
ఆర్పగల్గు మంత్రముకై..వెతకడమే రాదులే..!
పదునుకత్తి విసురుతున్న..మంచుగాలి కసిచూడు..
ఈ తియ్యని ఆవేదన..తెలుపడమే రాదులే..!
ప్రాణాలకు ప్రాణాలను..నింపువిద్య ఏమిటో..
నీ తలపుల వెన్నెలగా..మారడమే రాదులే..!
ప్రణయభావ తీర్థాలకు..నడిపించే కోమలీ..
నీ మాధవ గజల్ నిధిని..మునగడమే రాదులే..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు