210..
మైత్రీ సుందర నిత్యార్ణవమే మనసని చెప్పాలా..!!
చిత్ర శిల్పముల సత్యార్ణవమే తనువని చెప్పాలా..!!
కలలను కంటూ నిదురను మునుగుట ఎప్పుడు మానేవో..!?
భవ్య వర్ణముల రాగార్ణవమే బ్రతుకని చెప్పాలా..!!
ఆశల పక్షులు హాయిగా ఎగురగ బలమే కోరేవా..!!
శ్వాసల సాక్షిగ భావార్ణవమే మధువని చెప్పాలా..!!
చక్కని చిక్కని చూపుల లోతులు పట్టగ కుదిరేనా..!!
మక్కువ నిండిన స్నేహార్ణవమే వెలుగని చెప్పాలా..!!
భ్రమలకు అద్దం పట్టే తలపుల వీణను మీటేవా..!!
శూన్యపు లోగిలి మౌనార్ణవమే నిధియని చెప్పాలా..!!
'మాధవ' మాటకు అర్థం తెలిపే పదములు లేవోయ్..!!
బాధలు బాపే రాధార్ణవమే భవమని చెప్పాలా..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు