శీర్షిక: బొమ్మా బొరుసుల బంధం!!
ఓ చిరునవ్వు బంధానికి తొలిమెట్టుగా
ఒక ఆత్మీయ పలకరింపు
తెలియని బంధంతో కట్టిపడేస్తుంది!
ఒక పేగు పంచుకోక పోయినా
ఇంటిపేరు కలుపుకోక పోయినా
స్నేహమనే చెట్టు మొలుస్తుంది!
మాటలతో మాలలు అల్లుకుపోయి
అనుబంధపు ముడిని బిగిస్తుంది
రుణానుబంధం పాసమై
ఆత్మీయతను కురిపిస్తుంది!
మరో పరిచయం నీడలా వెంటాడి
పతనం వైపు పరుగులు పెట్టిస్తుంది
నీతి నియమాలు నిజానిజాలు మరిపిస్తుంది
నియమాలను బంగపరుస్తుంది!
ఏది ఏమైనా పిలుపు ఏదైనా
గతజన్మ రుణమో... శాపమో
పరిచయమై పలకరిస్తుంది
అది క్షణికమో... కలకాలమో
తీర్చాల్సిన రుణమేదో తరుముకొస్తో...
ఆ తరుణం తలవని తలపై తలుపు తడుతుంది !
ఒక పరిచయం అనుగ్రహిస్తే
మరో పరిచయం ఆగ్రహిస్తుంది
తీరని లెక్క లేవో సరిచేసి పోతుంది!
ఏంటో తెలియని ఈ మర్మం
బొమ్మా బొరుసుల బంధం!!
--జ్యోతి మువ్వల
13/11/21