చీకటిని చూసి జడుచుకుంటున్న ఇంటి గుమ్మాలు!
చీకటి దుప్పటి కప్పుకొని
వెన్నెల రాగాలను వింటూ
నిద్రపోతున్న పసిపాపకు
కాలరాత్రి కథలు ఏమి తెలుసు!
అమ్మ చెట్టు నీడలో
హాయిగా నిద్ర పోయే పక్షి కూనకి
రాక్షసత్వం నింపుకున్న నాన్న గాలి
ప్రాణం తీస్తుంది అని ఏమి తెలుసు?
పగలు జాబిల్లి రేయి సూరీడు
గమనాలు మార్చారా
నింగి నేల తలకిందులయ్యాయా
మృగాలతో మనుషులు సహజీవనం చేస్తున్నారా
ఎక్కడ జరిగింది పొరపాటు
సృష్టి ధర్మం మారలేదు కదా !
తండ్రి స్థానంలో మృగం
ఎలా పురుడుపోసుకుంది?
క్షణికావేశం విచక్షణ చంపేసిందా
అహంకారం ఆవహించిందా
మత్తు మైకం కమ్మిందా
ఆడబిడ్డ అని అలుసు అయ్యిందా?
నీలో మగతనం అంత ఉరకలెస్తే
ఒక బిడ్డను నవమాసాలు మోసి కను
సృష్టికి ప్రతి సృష్టి చేసి
మీ అహంకారపు సామ్రాజ్యంలో విర్రవీగు
చట్టం కన్నెర్ర చేస్తే రాలిపోయే ఆకువి
నోరులేని పసిగడ్డులపై ఏంటి మీ ప్రతాపం
నడిరోడ్డే కాదు నట్టిల్లు ప్రమాద ఘంటికలై
జండర్ పట్టింపులో జంతువుగా మారుతున్న సైకోలు
పుట్టుకతోనే భయం గంప మోస్తూ
చీకటి రాజ్యంలో చిద్రమైన జీవితాలు!
చీకటి పడుతుంది అంటేనే జడుచుకుంటున్న
ఇంటి గుమ్మాలు!!
-జ్యోతి మువ్వల
3/11/21