శీర్షిక: మూడుముళ్ల బంధం
మనసును శిలగా చేసి
ప్రేమను మేఘంలా కరిగించి
తేలిపోతావా?
వెన్నెల దారుల్లో
చుక్కల వనంలో
చేసిన బాసలు మర్చిపోతావా?
మాటకు విలువ కట్టి
మనసును వెలకట్టి
తూకం వేస్తావా?
స్వప్నంలో చిరు శ్వాసను సైతం
ఊపిరిగా చేసుకున్న ప్రాణం నీది కాదంటావా?
విడిపోవటానికి భూమిలో భాగాలు కాదు
దేహంలోని ప్రాణాలు అవి!
కలిసి కట్టుకున్న ఆశల సౌధాలు...
బళ్ళుమనే గాజు ముక్కలు చేసి
నీదారి నువ్వు చూసుకుంటావా?
బంధమంటే బాధ్యత కాదు
బలపడే దమనుల స్వరం!
అనురాగంతో అల్లుకున్న పూలవనం
మమతలను పూయించే ఇంధనం!
చేజారితే తిరిగిరాని ప్రేమామృతం
నిలుపుకోవాలి గుండె గూటిలో ప్రేమ దీపం!
ఒకరికొకరుగా జీవితాంతం
కలిసి ఉండేందుకే సాక్ష్యం ఈ మూడుముళ్ల బంధం!!
--జ్యోతి మువ్వల